హలో అండి, అందరికి నమస్కారం! ఇవ్వాళ ఒక ఆసక్తికరమైన సంఘటన జరిగింది. నేను మా బాబుకు డ్రెస్ కొనాలని ఒక స్టోరుకు వెళ్ళాను. అదే సమయంలో ఒక ఎనిమిది సంవత్సరాల పాప, వాళ్ళ అమ్మ కలిసి ఆ స్టోరుకు వచ్చారు. నాకు కావలసినవి అన్ని తీసుకున్నాక ఆఖరున మా పాపకు హెయిర్ బాండ్స్ వెతుకుతున్నపుడు, యాధృచికంగా ఆ అమ్మాయి మరియు నేను ఒకే బాండ్స్ సెట్ తీసుకోబోయాము. మాకు అప్పుడు అదే ఆఖరు సెట్ అని అర్థమైంది. వాళ్ళమ్మ తనను అదే ఎందుకు కావాలి అని అడిగితే, తను నేను అందంగా కనిపించటానికి ("Mom, I wanna look beautiful"!) అది కావాలి అని చెప్పింది. అంత చిన్న పాపకు అలా ఎందుకు అనిపించింది అని నేను చాలా ఆశ్చర్యపోయాను. మనము పిల్లలను ఎటువంటి వాతావరణంలో పెంచుతున్నామో ఆలోచిస్తే అర్థమైంది. చలనచిత్రాల దగ్గర్నుంచి టీవీ సీరియల్స్, అడ్వేర్టీసెమెంట్స్ వరకు పిల్లల్ని ఎంత ప్రభావితం చేస్తున్నాయి కదా! పొడువు-పొట్టి, లావు-సన్నం, నలుపు-తెలుపు, ఇలా బాహ్యసౌందర్యానికి ప్రాధాన్యత ఇస్తున్నాము. ఒక బిడ్డకు అమ్మ ఎలా ఉన్నా అమ్మే. అమ్మ మాటే అందం, అమ్మ సరిగ్గా పాడలేకపోయినా అమ్మ పాటే మధురం. అందం అనేది కేవలం మన ఆలోచనా దృక్పథమే కదా!
అమ్మ ప్రేమ అందం, నాన్న గారాబం అందం
భర్త పిలుపు అందం, నాన్నమ్మ పలకరింపు అందం
పసిపిల్లల బోసి నవ్వులు అందం, తొలకరి వాన జల్లులు అందం
గుడిలో అమ్మవారు అయ్యవార్లు అందం
వారి చల్లని చూపులే మనసుకు పరమానందం.
బాహ్యసౌందర్యం కన్నా అంతర్సౌందర్యం గొప్పది. ప్రతి జీవాత్మ లోనున్న పరమాత్మ ఒక్కటి. ఇంత చిన్న సత్యాన్ని తెలుసుకున్న మనిషి ధన్యుడు.
అదండి సంగతి! ఇంకో పోస్టుతో మళ్ళీ కలుస్తాను.